Friday, November 22, 2024

10లోపు గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి, ప్రభ న్యూస్ ప్రతినిధి : ఆగస్టు 10 లోపు గృహలక్ష్మి కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహలక్ష్మి పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, భూపాలపల్లి జిల్లాలో ఉన్న భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 2650 ఇండ్లు, మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు 1500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో గృహలక్ష్మి పథకం కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా తయారు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం లబ్ధి కోసం అవసరమైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 10 తారీఖు లోగా మండల కార్యాలయాల్లో, మున్సిపాలిటీ కార్యాలయంలో లేదా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక గృహలక్ష్మి కౌంటర్లలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

ఆగస్టు 10వ తారీఖు వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా రూపొందించి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇండ్లు లేని వారికి, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద లబ్ది పొందని వారిని అర్హులుగా ఎంపిక చేయడం జరుగుతుందని , ఆగస్టు 20వ తారీకు వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఆగస్టు 25 నాటికి జిల్లాకు కేటాయించిన గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

గృహలక్ష్మి కింద లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, గృహలక్ష్మి ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సమీప ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, ప్రతి మండల తహసిల్దార్ కార్యాలయంలో మున్సిపాలిటీ కార్యాలయంలో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 10లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement