Friday, November 22, 2024

WGL: డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు

వరంగల్ క్రైమ్, అక్టోబర్ 6 (ప్రభ న్యూస్) : కరీంనగర్ డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్ వీరు నాయక్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో రెండు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. శుక్రవారం ఉదయమే రైడ్స్ చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ డిఎస్పీ పి.సాంబయ్య నేతృత్వంలో ముగ్గురు ఇన్స్ పెక్టర్లు శ్యామ్ సుందర్, శ్రీనివాస్, రవిల ఆధ్వర్యంలో దాడులు చేశారు. విలువైన భూముల పత్రాలు, ప్లాట్స్ డాక్యుమెంట్స్ తో పాటు బంగారు ఆభరణాలు, రూ.2 కోట్ల 2లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరు నాయక్ పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకొంటున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

వీరు నాయక్ పై అవినీతి ఆరోపణలు :

వీరు నాయక్ పనిచేసిన ప్రతిచోట అవినీతి ఆరోపణలకు పాల్పడ్డట్టు ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా గతంలో జనగామ జిల్లాలో జేడీఏ గా పనిచేసిన కాలంలో విపరీతంగా లంచాలు తీసుకొని పనిచేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అక్కడ పనిచేసిన టైమ్ లోనే బాధితులు ఫిర్యాదులు చేశారు. కానీ ఈ లోపు పదోన్నతిపై కరీంనగర్ కు బదిలీపై వెళ్లారు. సదరు ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం హన్మకొండ హంటర్ రోడ్డు, గూడూరు మండలం శ్రీరాముల పల్లిలోని వీరునాయక్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కనుగొన్నారు. ఇదిలా ఉండగా వీరు నాయక్ సతీమణి రాధ మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యగానే ఏసీబీ అధికారులచే దాడులు చేయించారనే ఆరోపణలున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement