భీమదేవరపల్లి (వరంగల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఇంటి వద్ద ఆడుకుంటూ… ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన రత్నగిరిలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం… మండలంలోని రత్నగిరి గ్రామానికి చెందిన గడప సంపత్, స్వర్ణలత కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రతి రోజూ పిల్లలను సంపత్ తండ్రికి అప్పగించి వారు కూలీ పనులకు వెళుతుంటారు. రోజు మాదరిగానే పిల్లలను అతడికి అప్పగించి పనులకు వెళ్లారు. ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలో చిన్న కుమార్తె ఆస్మిక (4) అనే బాలిక ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్ననీటి సంపులో పడిపోయింది.
ఇదీ గమనించి ఇరుగుపొరుగువారు వెంటనే వచ్చి సంపు నుంచి ఆ చిన్నారిని బయటకు తీశారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని కూలీ పనుల్లో ఉన్నా ఆ చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిచూసే సరికి ఆస్మిక మృత దేహాన్ని చూసి బోరున విలపించారు. వారి రోదనలతో రత్నగిరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వంగర ఎస్సై దివ్య కేసు దర్యాప్తుచేస్తున్నారు.