నర్సంపేట, (ప్రభ న్యూస్) : వరంగల్ జిల్లా నర్సంపేట జిల్లా ఆసుపత్రికి మరో మణిహారం తోడైంది. జిల్లా ఆసుపత్రికి 50 పడకల అత్యవసర సేవల క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు అయినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలను వివరించారు. వచ్చే మూడు నెలల్లో నిర్మిస్తున్న 250 పడకల జిల్లా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. డి హబ్ సైతం అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులో ఉందని, త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు నర్సంపేట నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులను అండగా నిలుస్తున్నారని, మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ కేంద్రంలో ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చే భగీరథ పనులు చివరి దశలో ఉన్నాయని, మిషన్ భగీరథ, గ్యాస్ పైప్ పనుల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని మరల మంచిగా చేసే బాధ్యత సంబంధిత గుత్తే దారుదే అని అన్నారు. మద్దతు ధర అంశాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇద్దరు తోడు దొంగలే అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మద్దతు ధర రెట్టింపు అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట నారాయణ గౌడ్,రవీందర్ రెడ్డి,విద్య సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.