ఆంధ్రప్రభ స్మార్ట్, వరంగల్, హైదరాబాద్ : చారిత్రక నగరమైన వరంగల్ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం హెచ్ఆర్‌డీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రధాన సలహాదారులు నరేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ కార్యదర్శి దానా కిషోర్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ లు డాక్టర్ సత్య శారదా, పి.ప్రావీణ్య , వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు దీటుగా…
వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధిపై మంత్రులు కీలక భేటీ నిర్వహించారు. వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్‌లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చర్చించారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
గత జూన్‌లో వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెరిటేజ్ సిటీగా వరంగల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంను డెవలప్ చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధి విషయంలో 20 రోజులకు ఓసారి ఇన్‌చార్జి మంత్రి అధికారులతో సమావేశం కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్ అభివృద్ధిపై మంత్రులు దృష్టిసారించారు.
రెండో రాజధానిగా అడుగులు
వరంగల్ నగరం రెండో రాజధాని అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. బహుశ రెండో రాజధానిగా చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ అభివృద్దిపై దృష్టి సారించినట్లు పలువురు భావిస్తున్నారు.