హైదరాబాద్: కేంద్రంలో బిజెపిని ఓడించాలంటే ముందు తెలంగాణ లో కెసిఆర్ ని గద్దె దించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.. తెలంగాణలో బిజెపి,బిఆర్ఎస్,ఎంఐఎం లు ఒక్కటై తమపై పోటీ చేస్తున్నాయని, అయినా తమ విజయాన్ని ఆ పార్టీలు ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. దీనిలో భాగంగానే నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు.
“బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి.. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. . బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు” అంటూ ప్రశ్నించారు..
‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. మోడీలా విభజన రాజకీయాలు చేయను . నేను మోడీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోడీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలి. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు.