జీహెచ్ఎంసీ నిర్మించిన ప్రహరీ కూల్చివేత
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫిర్యాదు
కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ నెల 10వ తేదీన జూబ్లీహిల్స్ డివిజన్ నందగిరి హిల్స్ గురు బ్రహ్మనగర్‌లోని జీహెచ్ఎంసీ స్థలంలో నిర్మించిన ప్రహరీని ఆయన సమక్షంలో ఆక్రమణదారులతో కూల్చి వేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే దానంతో పాటు కొందరు ఆక్రమణదారుల నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
ప్రహరీ కూల్చివేతతో ₹పది లక్షల నష్టం
నగర పరిధి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-69 నందగిరి హిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ కాలనీలో 800 గజాల వరకూ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ఓపెన్ ల్యాండ్‌ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ నిర్మించాలని జీహెచ్ ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నాయక్, రాంచందర్ తదితరులు గోడను కూల్చేయించారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వి.పాపయ్యా ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేతతో జీహెచ్ఎంసీ ₹పది లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.