హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ ఏడాది వానాకాలం రైతు బంధు రైతులందరి ఖాతాల్లో జమ కాలేదు. ఇంకా దాదాపు 14 లక్షల మంది రైతులు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పడి సెల్‌ఫోన్‌లో మెసేజ్ మోగుతుందా అన్న ఆతృతలో ఉన్నారు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో వర్షాభావం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రైతులు ముందుగా వరి నార్లు పోశారు. కరువు ఛాయలు ప్రస్ఫుటమవడంతో మళ్లి వర్షాధార పంట అయిన పత్తి సాగు వైపు మళ్లారు. ఈ నేపథ్యంలో వరి విత్తనాల కొనుగోలుకే రైతులు దాచుకున్న డబ్బులు అయిపోయాయి. మరోసారి పత్తి విత్తనాలు కొనుగోలుకు అప్పులు చేసి మరీ రైతుబంధు వస్తుందన్న ఆశతో పత్తి సాగుకు మొగ్గు చూపారు. అయితే ఈ సారి వానాకాలం రైతుబంధు అయిదున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోనే జమ అయినట్లు తెలుస్తోంది.
దీంతో 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులు రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆర్థికశాఖ రైతుబంధు పథకానికి కొద్దిమేరనే నిధులు విడుదల చేయడంతో అయిదున్నర ఎకరాలకు మించి ఉన్న భూమికి రైతు బంధు నిధుల కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్థిక నిధులను ఉద్యోగులు, పింఛనర్ల జీతాలకే సర్దుతుండడంతో సన్న, చిన్నకారు రైతుల వరకే రైతు బంధు నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయంటున్నారు. ఈ ఏడాది రైతు బంధు కింద దాదాపు 70లక్షల మంది అర్హులుగా ఉన్నారు. మొత్తం 7,720.29 కోట్లు నిధులు ప్రభుత్వం రైతుబంధు పంపిణీ కోసం లక్ష్యంగా విధించుకుంది.
ఈ వానాకాలం రైతుబంధు నిధుల పంపిణి జూన్ 26 నుంచి ప్రారంభమైంది. జూన్ 30 వరకు రూ.4,377.42కోట్లను అయిదున్నర ఎకరాల భూమి వరకు 57లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మిగతా రూ.3,242 కోట్లను 5 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. వీరి సంఖ్య దాదాపు 14 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వానాకాలం మినహాయించి ఇప్పటి వరకు పంపిణీ చేసిన రైతుబంధు నిధులు ఎలాంటి పరిమితులు లేకుండా ఎంత భూమి ఉన్నా అందరి రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే ప్రస్తుతం నిధుల కొరత కారణంగానే అప్రకటిత పరిమితిని రైతుబంధు పంపిణీపై విధించాల్సి వస్తోందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిధుల పంపిణీలో సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రైతుబంధు నిధుల పంపిణీ మొదటి రోజు ముందుగా ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయి.
ఆ తర్వాత రోజు 2 ఎకరాలు అలా 5 ఎకరాలు ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయిదు ఎకరాల వరకు రైతు బంధు పంపిణీ పూర్తయిన తర్వాత 10 ఎకరాల లోపు పంపిణీ చేస్తూ వస్తున్నారు. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు రైతుబంధు నిధుల కోసం ప్రతిసారి వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈసారి అయిదున్నర ఎకరాల వరకే రైతుబంధు నిధులు పంపిణీ కావడంతో అంత కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు రైతుబంధు నిధుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. కాగా ఈ వారంలో అయిదు ఎకరాల కు మించి ఉన్న భూమి తాలూకు రైతులకూ రైతు బంధులు నిధులు పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు