అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యతని చెప్పారు. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని తెలిపారు. మరోవైపు ముషీరాబాద్ గాంధీనగర్‌లోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఆస్తమా రోగి లక్ష్మీ శ్యాంసుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల గ్రౌండ్‌లోని 83వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.