హైదరాబాద్ – అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ,. 2020లో పదిహేడు రోజులు, 2023లో పదకొండు రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా చర్చ జరగాలన్నారు.
ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని విపక్షాలు అనడం సరికాదన్నారు. ఒకసారి ఎమ్మెల్యే కొనడం వల్లే బిఆర్ఎస్ ఓడిపోయిందని గుర్తు చేశారు.. అధికారం కోసం మళ్లీ మరోసారి ఎమ్మెల్యే కొనుగోలు చేస్తే ఇక ఆ పార్టీకి పుట్టగతులుండవన్నారు.. గతంలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ గెలవలేదని పేర్కొన్నారు..పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు. ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందని కూనంనేని ఆరోపించారు. ధర్నాలు,సమ్మెలపై ఆంక్షలు విధించి హక్కులను కాల రాసిందని మండిపడ్డారు..
నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని ప్రశంసించారు. అప్పుడు జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. హామీలను నెరవేర్చడానికి డబ్బులు ఇబ్బంది కాదని గుర్తించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చారని కితాబిచ్చారు. అయితే ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలన్నారు.