కరోనాను ఎదుర్కోవడంలో విటమిన్-డీ కీలకపాత్ర పోషిస్తుందని తెలంగాణ వైద్యబృందం పరిశోధనలో వెల్లడైంది. శరీరంలో విటమిన్-డీ సరైన మోతాదులో ఉంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని ఆ బృందం పేర్కొంది. గాంధీ, నిమ్స్ దవాఖానలకు చెందిన ఈ వైద్య బృందం ఆరు నెలలపాటు శ్రమించి విటమిన్-డీపై అధ్యయనం పూర్తిచేసింది. పల్స్ డీ థెరపీ’ పేరుతో జరిపిన ఈ అధ్యయనం www.natu re.comలో ప్రచురితమైంది.
ఈ బృందం నిమ్స్, గాంధీ దవాఖానల్లో 130 మంది రోగులను విటమిన్-డీ, నాన్ విటమిన్-డీ గ్రూప్లుగా విభజించి పరిశోధన జరిపింది. విటమిన్-డీ గ్రూప్ వారికి వారి బీఎంఐ ఆధారంగా 8 నుంచి 10 రోజులు రోజుకు ఒక విటమిన్-డీ (60,000 ఐయూ) గోళీలను అందించారు. నాన్ విటమిన్ గ్రూప్ వారికి ఎలాంటి గోళీలు ఇవ్వలేదు. అనంతరం ఈ రెండు గ్రూపుల వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఎన్ఎల్ రేషియో, సీఆర్పీ, ఎల్డీహెచ్, ఐఎల్-6, ఫెరిటిన్, డీ-డైమర్ వంటి పరీక్షలను (ఇన్ఫ్లమేటరీ మార్కర్స్) ఇరు వర్గాల్లో నిర్వహించారు. విటమిన్-డీ అందించిన వారిలో మెరుగైన ఫలితాలు రాగా, అందించని వారిలో వ్యాధి తీవ్రత పెరిగింది. చికిత్స పొందేవారికి వరుసగా 8 రోజులు, వైరస్ సోకనివారు 4 రోజులు తీసుకుంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని వైద్య బృందం తెలిపింది. శరీరంలో విటమిన్-డీ 60 స్థాయిలో ఉంటే కరోనా వచ్చేందుకు 5%, 30 కంటే తక్కు వ ఉంటే 15 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే విటమిన్ డీ స్థాయి 60గా ఉండాలంటే ఎంత బరువున్న వారికి ఎంత డోస్ ఇవ్వాలన్న దానిపై గతంలో నిమ్స్ జరిపిన అధ్యయనం ఉపయోగపడింది.