భారీ వర్షాలతో పంట నష్టంపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించారు. వరదల్లో ప్రమాద వశాత్తు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి అక్కన్నపేట మండలం కన్నారం గ్రామంలో పర్యటించి భారీ వర్షాల వల్ల దెబ్బ తిన్న పంట పొలాల్లోకి వెళ్లి అక్కడి పరిస్థితిని వినోద్ కుమార్ చూశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదవశాత్తూ చనిపోయిన కన్నారం గ్రామానికి చెందిన పొన్నాల మహేందర్ కుటుంబ సభ్యులను వినోద్ కుమార్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగు రామ చంద్రయ్య తల్లి ఈశ్వరమ్మ ఇటీవల చనిపోయిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శంకటపట్నం మండలం కల్వల ప్రాజెక్టు ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి సందర్శించారు. 70 ఏళ్ల నాటి ఈ ప్రాజెక్టు భారీ వర్షాల కారణంగా గట్లు దెబ్బతిని ప్రాజెక్టులోని నీరంతా పంట పొలాల్లోకి వెళ్లడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితిని వినోద్ కుమార్ స్వయంగా గమనించారు. కల్వల ప్రాజెక్టును తిరిగి నిర్మించేందుకు కృషి చేస్తానని వినోద్ కుమార్ బాధితులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో వినోద్ కుమార్ తో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీ వీ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పర్యటించారు.