ఇంటింటా జ్వరాల విజృంభణ
ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరపీడుతులు
పారిశుధ్యం మెరుగుపరచాలని వినతి
జ్వరాల అదుపునకు చర్యలు చేపట్టాలి
ఆంధ్రప్రభ స్మార్ట్, వాజేడు (ములుగు జిల్లా) : ములుగు జిల్లా వాజేడులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాల బారిన పడ్డారు. ప్రధానంగా శివాలయం వీధిలో జ్వరపీడితులు అధికంగా ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.
క్షీణించిన పారిశుధ్యం
పది రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలో పారిశుధ్యం క్షీణించింది. గ్రామంలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో ఒక వైపు మురుగు నీరు, వర్షపు నీరు కలియడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే నిలిచిన మురుగుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దోమలు కూడా విజృంభిస్తున్నాయి. పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని కోరారు.
జ్వరాల అదుపు చేయాలి
గ్రామంలో ప్రతి ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నవారు ఒకరిద్దరు ఉన్నారు. జ్వరాలు అదుపు చేయడానికి వైద్య యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలన్నారు.