Tuesday, November 19, 2024

ప్రగతి బాటలో పల్లెలు.. అధికారుల్లో పెరిగిన జవాబుదారీ తనం

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: నూతన పంచాయ తీరాజ్‌ చట్టం ద్వారా పెరిగిన జవాబుదారీతనం, ప్రభుత్వాల సహకారం.. ప్రత్యేక అధికారుల నియామకం, కఠినంగా రూపొందించిన నిబంధనలు.. గ్రామాల్లో వ్యవసాయానికి తిరుగులేకుండా అందుతున్న సాగునీరు అన్నీ పల్లెల బలోపేతానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా తెలంగాణ పల్లెలకు, పంచాయతీరాజ్‌ శాఖకు పథకాల పంట పండుతోంది. గ్రామాల వారీగా.. ఏడేళ్ళలో వచ్చిన మార్పులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుంటోంది. సీఎం కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై ఎంతో మథనం చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లను కూడా బాధ్యులను చేయగా, వారికి జాబ్‌ చార్ట్‌ నిర్దేశించగా ఫలితం కళ్ళముందు కనబడుతోంది.

ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీలు సమకూరాయి. గతంలో 87 గ్రామాల్లో మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి. ట్రాక్టర్‌ గ్రామ పారిశుద్ధ్య స్వరూపాన్ని మార్చేసింది. ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్‌ షెడ్లలో తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి ఎరువులు తయారు చేస్తున్నారు. వాటిని విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది.

ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతివనం ఏర్పాటైంది. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో 19472 పల్లె ప్రకృతి వనాలను 13,657 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలతో, పల్లె ప్రకృతి వనంతో గ్రామం పచ్చగా ఆహ్లాదాన్ని పంచుతు న్నది. ప్రతి మండలానికి ఒకటి చొప్పున పది ఎకరాల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో మొక్కలు, పల్లె ప్రకృతి వనాలు ఇలా గ్రీనరీని పెంచడానికి పంచాయతీరాజ్‌ చట్టంలోనే 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు.

గ్రామ పంచాయితీలకు 2004 నుంచి 2014 వరకు రూ.4357 కోట్లు ఖర్చు చేయగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేండ్లలో రూ.13,767 కోట్లను సమ కూర్చిందని మంత్రులు చెబుతు న్నారు. గ్రామీణ నీటి సరఫరా కోసం 2004 నుంచి 2014 వరకు రూ.4198 కోట్లు ఖర్చు చేస్తే ఏడేండ్ల పాలనలో రూ.36 వేల కోట్లు ఖర్చు చేసింది. గ్రామీణ పాంతాల అభివృద్ధి కోసం 2004 నుంచి 2014 వరకు రూ.12,173 కోట్లు ఖర్చు చేయగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ సారధ్యంలో రూ,58,303 కోట్లు ఖర్చు చేసింది. వీటితో పాటు ఎస్‌డీఎఫ్‌ ద్వారా రూ.949 కోట్లు కేటాయించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు కేటాయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement