Tuesday, November 19, 2024

కరోనా నిరోధంపై కేసీఆర్ సర్కార్ కు చిత్తశుద్ధి ఉందా?

కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై తెలంగాణ ప్రభుత్వంగా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. హైకోర్టుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదన్నారు. రాజకీయ మీటింగ్‌లను మాత్రమే పట్టించుకుని ఇతర పబ్లిక్ ప్రదేశాలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు.

”దేశవ్యాప్తంగా ఒకవైపు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని గణాంకాలతో సహా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న ఏపీ, కేరళ, మహారాష్ట్రల్లోని పరిస్థితులు తెలంగాణకు మాత్రం లేవని, థర్డ్ వేవ్ ముప్పు లేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పుడు అవి  తెలంగాణకు వ్యాప్తి చెందకుండా సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేంటో వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే మీటింగులలో జనం గుమిగూడి కరోనా వ్యాప్తి చెందుతుందని, కరోనా పెరిగితే లీడర్లదే బాధ్యత అని కూడా వ్యాఖ్యానించారు. అది నిజమైన ఆందోళనే అయితే, కేవలం రాజకీయ పార్టీల మీటింగుల్లో మాత్రమే జనం గుమిగూడుతున్నారా? రాష్ట్రంలోని పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా రద్దీ లేనే లేదా? అనేది సర్కారు ఆలోచించాలి. గతంలో వైరస్‌ల నివారణకు రోజు లేదా రోజు విడిచి రోజు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేవారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకునేవారు. ఈ చర్యలు క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. నేడు కనీస పర్యవేక్షణ లేని ఈ సర్కారు తీరు చూస్తుంటే అసలు కరోనా వ్యాప్తి నిరోధంపై పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. థర్డ్ వేవ్ ఆందోళనల కారణంగానే కదా హైకోర్టు గురుకులాలు, హాస్టళ్లల్లో ప్రత్యక్ష బోధనకు బ్రేక్ వేసింది? హైకోర్టుకు ఉన్న ఆందోళన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు లేకపోవడం విడ్డూరంగా ఉంది. కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కారుకు ఒక విధానమంటూ లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి”అని విజయశాంతి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌.. అక్కడేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement