Saturday, November 23, 2024

కాళేశ్వరం పనుల్లో లోపాలు బయటపడ్డాయి: విజయశాంతి

తెలంగాణ సర్కార్ చేసిన తప్పులు ఎంత దాచినా దాగవని రుజువయ్యిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో లోపాల్ని ఒక్కొక్కటిగా మీడియా బయటపెడుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభించిన నెలన్నరకే నిర్మాణంలో లోపాలు వెలుగు చూస్తుంటే… ప్రభుత్వం ఏ స్థాయిలో కాసులకు కక్కుర్తి పడిందో అర్ధం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. 2019 సెప్టెంబర్ 3న కన్నెపల్లి ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ దెబ్బతిని పంపుహౌస్‌‌‌‌ నీట మునిగిందన్నారు. 200 మీటర్ల పొడవు, ఏడు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిచి మోటార్ల విడిభాగాలు మునిగిపోయాయని చెప్పారు. అదే సమయంలో మేడిగడ్డ, అన్నారం గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. పంపుహౌసుల్లో మోటార్లు నడవకుండా తిప్పలు పెట్టాయని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే లింక్‌‌‌‌–2లోని లక్ష్మీపూర్‌‌‌‌ పంపుహౌస్‌‌‌‌ గోడలు లీకై నీళ్లు లోపలికి వచ్చాయని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాదే కాళేశ్వరాన్ని ఆకాశానికి ఎత్తాలనే ప్రయత్నం మిడ్‌‌‌‌మానేరు రిజర్వాయర్‌ను దెబ్బతీసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. డ్యాం ప్రొటోకాల్‌‌‌‌ పాటించకుండా నిండా నీళ్లు నింపడంతో కట్టకు బుంగపడి రిజర్వాయర్‌‌‌‌ మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చిందంటే ప్రాజెక్టు నాణ్యత ఏంటో నిర్దారణ అయ్యిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలకులకు దగ్గరవారైన నాయకుల ఆశ్రితులకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు పొందారే గాని, ప్రజల సొమ్ము వృధా అయ్యేలా చేసిన పనులపై ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువయ్యిందని విమర్శించారు. ఇంకా…. నీటిని తరలించడానికి వినియోగించే కాలువలు కూడా కాంట్రాక్టర్లు ఇచ్చే సొమ్ముకు దాసోహం అయ్యాయి తప్ప, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు…. ఉన్న కాలువలు సైతం కొట్టుకుపోయి పంటలు మునిగి పోవడంతో రైతుల దుస్థితి దీనంగా మారింది. ఇలా ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాల వల్ల కమిషన్లు పొందడమే గాని రైతులకు ఎలాంటి ఉపయోగం జరగలేదని తెలిపారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వమే నేడు రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజలు ఓట్ల రూపంలోనే సమాధానం చెప్తారని విజయశాంతి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: TS Assembly: రాష్ట్ర సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement