టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త నాటకాలు షురూ చేశారని ఎద్దేవా చేశారు. పచ్చి అబద్ధాలు, మోసాలతో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగిందని చెప్పారు. తెలంగాణను నిండా ముంచేసి అప్పుల పాల్జేసిన కేసీఆర్.. ఇక దేశాన్ని ముంచేందుకు కొత్త డ్రామాలాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని అంటున్న కేసీఆర్… ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు ఇచ్చే దుస్థితి ఎందుకొచ్చిందో… పెన్షనర్లకు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు చార్జీలు పెంచారు… మళ్లీ ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నరు? అని నిలదీశారు.
కేసీఆర్ ఎంఐఎంను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నాడని ఘాటుగా అన్నారు. ఒక టీఆరెస్ ఎమ్మెల్సీ బాధ్యత గల సీఐని పట్టుకుని పచ్చి బూతులు తిట్టాడని మండిపడ్డారు. పోలీసులంటే బానిసలనుకున్నారా? అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కేసీఆర్… కాళేశ్వరంలో వేల కోట్లు దోచుకుని తన కుటుంబ ఆస్తుల్ని లక్షల కోట్లకు పెంచుకున్నాడని ఆరోపించారు. పార్టీ ఆస్తులతో పాటు తన కుటుంబ ఆస్తులు కూడా వెల్లడిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నయని, కోర్టు విచారణల్లో ఎప్పటికైనా తప్పక నిజం బయటకి వస్తుందని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.