Tuesday, November 26, 2024

కేసీఆర్ మాటలను ఒక్క నిరుద్యోగి కూడా నమ్మట్లేదు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మరోసారి మండిప‌డ్డారు. ‘తెలంగాణలో వేలాది ప్రభుత్వ కొలువుల భర్తీ అంటూ ఉప ఎన్నికలప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఊదరగొడుతున్న సీఎం కేసీఆర్ గారి మాటలను ఒక్క నిరుద్యోగి కూడా నమ్మ‌ట్లేదనడానికి హైదరాబాదులోని ఆయన అధికార నివాసం ప్రగతి భవన్‌పై జరిగిన నిరుద్యోగ జేఏసీ ముట్టడి కార్యక్రమమే పెద్ద ఉదాహరణ.  ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి హామీని సారు ఏనాడో మర్చిపోయారు. రాష్టవ్యాప్తంగా సుమారుగా లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… భర్తీ చేస్తామని చెప్పిన 50 వేల ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ వెలువడక పోవడాన్ని నిరుద్యోగ జేఏసీ నిలదీసింది. నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజుల రూపంలో వసూలయ్యే సొమ్ముతోనే టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి జీతాలందుతోంటే…. ఇప్పటికే వయోపరిమితి దాటిపోతున్న ఎందరో నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం చూసీ చూసీ విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని విజ‌య‌శాంతి చెప్పారు.

‘టీఎస్‌పీఎస్సీ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై జీవో కూడా జారీ అయినప్పటికీ నోటిఫికేషన్ల విడుదల ఏళ్ల‌కేళ్లు ఆలస్యం అవుతున్న కొద్దీ వయోపరిమితి దాటుతున్న వారి సంఖ్య వేలల్లో పెరిగిపోతోంది. వీరిలో 25 ఏళ్లు దాటినవారు పోలీస్ శాఖలో ఉద్యోగాలు కోల్పోయినట్టే. 40 ఏళ్ల‌ వయసు దాటినవారు మొత్తంగా సర్కారు కొలువులకు దూరమయ్యే పరిస్థితి. ఈ సర్కారు తీరుపై విద్యార్థి లోకం శాపనార్థాలు పెడుతున్నా తెలంగాణ పాలకుల్లో చలనం లేదు. వారికి కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు’ అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇది కూడా చదవండిః హైదరాబాద్ జంట పేలుళ్లకు 14 ఏళ్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement