Tuesday, November 19, 2024

బీజేపీ ఒత్తిళ్లకు కేసీఆర్ దిగొచ్చారు: విజయశాంతి

కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సీఎం గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లపై బీజేపీ ఒత్తిళ్లకు కేసీఆర్ దిగొచ్చారని తెలిపారు. అయితే, గత 15 నెలల కాలంలో కరోనాతో బాధపడి ఆసుపత్రి బిల్లులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ మెంట్ చేస్తుందన్న నిర్ణయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఓవైపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, జల ప్రాజెక్టుల కమిషన్లు ఉండగానే… టీఆర్ఎస్ దొరల అనుచర బంధుగణం మెడికల్ మాఫియా అవతారం ఎత్తిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమ్ డెసివిర్ తోపాటు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 5 లక్షల వ్యాక్సిన్ డోసుల నిల్వ లెక్క తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. లేకపోతే ఇది టీఆర్ఎస్ బ్లాక్ మార్కెట్ కుంభకోణం అని భావించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement