నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : స్త్రీ శక్తి విజయానికి సూచిక విజయదశమి అని.. మహిళా జయానికి ప్రతిబింబమని.. దసరా పండుగ అంటే.. మహిళల విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో దసరా పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మేల్యే గణేష్ గుప్తాలు శ్రీ రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పండు గలు వైభవోపేతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు సంబరాలు కూడా ఘనంగానే జరుగుతాయన్నారు… ఇది తెలంగాణకే గర్వకారణమన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే పండగలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. చెడును తగ్గించి మంచి గుణాలను పెంపొందించుకోవాలనీ సూచించారు. చెడుని జయించి.. విజ యాన్ని గెలిపించుకోవడమే విజయదశమి అని కల్పకుంట్ల కవిత పేర్కొన్నారు.
9రోజుల పాటు బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నామని, సద్దుల బతుకమ్మ సొలపుర్ లో జరపటం సంతోషాన్ని ఇచ్చిందనీ పేర్కొన్నారు. బతుకమ్మ పాట వలే శ్రీరాముని పాట కూడా చేశామనీ, ఖిల్లా రామాలయంలో ఈ పాటను ఆవిష్కరించామనీ తెలిపారు. ప్రజలకు మంచి చేసే వారికి సమున్నత స్థానం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.