Monday, November 25, 2024

Vijaya Dairy | ఆర్థిక కష్టాల్లో విజయ డైరీ…!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విజయ డైరీ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గడిచిన అయిదేళ్లపాటు లాభాలు పండించిన విజయ డైరీ… ఇప్పుడు చిన్న చిన్న ప్రయివేటు డెయిరీల నుంచి ఎదురయ్యే పోటీని కూడా ఎదుర్కోలేకపోతోంది. ఈ ఏడాది నుంచే విజయ డైరీని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి.

దాంతో పలు జిల్లాల్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం పాలను కూడా సేకరించలేని స్థితికి చేరుకుంది. ఉదాహారణకు ఖమ్మం జిల్లాలో రోజుకు 12వేల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించిన విజయ డైరీ కొద్ది రోజులుగా రోజుకు కనీసం 400 లీటర్ల పాలు కూడా జిల్లా వ్యాప్తంగా సేకరించలేకపోతుండడం ఆ సంస్థ పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అదే సమయంలోవిజయ డైరీని నిధుల కొరత వెంటాడుతోంది. మరోవైపు మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెం డ్‌ కూడా అందించిన ఈ సంస్థ ఇప్పుడు నష్టాల బాటలో సాగుతోంది. రైతులకు పెద్ద ఎత్తున పాల బిల్లులు బకాయిలు ఉన్నాయి. దీంతో ప్రతీ జిల్లాలో బిల్లుల బకాయిల చెల్లింపు కోసం రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపాల్సిన దీన స్థితిలో ప్రస్తుతం విజయడైరీ కూరుకుపోయింది.

అదే సమయంలో రాష్ట్రంలోని ప్రయివేటు డైరీలతో ఎదురయ్యే పోటీకి తోడు పొరుగు రాష్ట్రానికి చెందిన ఇదే బ్రాండ్‌ (విజయ) పాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. దీని ప్రభావం కూడా విజయ డైరీ రోజువారీ పాల సేకరణ గణనీయంగా తగ్గేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

విజయ డైరీ రోజు లక్షన్నర మంది రైతుల నుంచి 2.5లలక్షల నుంచి 3లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. ఇందుకు ప్రతీ రోజూ రైతులకు కనీసం రూ.1.5కోట్ల నుంచి రూ.2కోట్ల వరకు బిల్లులు చెల్లించాలి. అయితే కొద్ది రోజులుగా ప్రతి 15రోజులకోసారి రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లులు నిలిచిపోయాయి.

- Advertisement -

ప్రస్తుతం మూెడు సంబంధించి రూ.130 కోట్ల దాకా రైతులకు పాల బిల్లులు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. గతంలో పదిహేను రోజులకోసారి బిల్లులు రావడంతో ఈ డబ్బులతో ఇంటి అవసరాలు తీర్చుకునేవారు.

ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో ఇంటి అవసరాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం గేదెలకు దాణా కూడా పెట్టలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో డెయిరీ యాజమాన్యం చేసిన తప్పుల కారణంగా పాడి రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి.

పాడి రైతులు గేదెల కొనుగోలు చేసేందుకు విజయ డెయిరీ గతంలో పలు బ్యాంకుల నుం చి రుణాలు ఇప్పించింది. ప్రతినెలా రైతులకు రావాల్సిన పాల బిల్లుల నుంచి విజయ డెయిరీనే రైతుల తరపున బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తున్నది. నాలుగైదు నెలలుగా రైతులకు పా ల బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నది.

గతంలో మాదిరిగా డెయిరీ రైతుల తరుపున బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నది. దీంతో విజయ డెయిరీతో తమకు సంబంధం లేదని, రుణం చెల్లించాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిడి చేస్తున్నాయి. ‘తీసుకున్న రుణాలు చెల్లించండి. లేదంటే తదుపరి పరిణామాలకు మీరే బాధ్యులు’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

ఆర్థికంగా ఇబ్బందులుచుట్టు ముట్టడంతో నెయ్యి, పాల పొడి, వెన్న, మజ్జిగ, దూద్‌ పేడా, లస్సీ, పెరుగు, ఐస్‌క్రీమ్‌ తదితరాల విజయడైరీ ఉత్పత్తుల విక్రయాలు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని దేవాలయాలు సైతం విజయ డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయకపోవడంతో విజయ డైరీకి కష్టాల నుంచి గట్టెక్కెందుకు ఉన్న దారులు ఒక్కటొక్కటిగా మూసుకుపోతున్నాయి.

మరోవైపు పాలు సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటర్‌కు రూ.4 చొప్పున రాయితీని 2014లో ప్రకటించింది. అయితే మూడున్నరేళ్లుగా ఈ ప్రోత్సహకం రైతులకు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement