హైదరాబాద్, ఆంధ్రప్రభ: రోగుల నుంచి అందినకాడికి దోచుకోవడమే ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రయివేటు మెడికల్ ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవడంతో సీజనల్ జ్వరాలు, ఇతర అనారోగ్యంతో రోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ఆరోగ్యం కోసం పేద, సామాన్యరోగులు అడిగినంత ఫీజు చెల్లిస్తారన్న ధీమాతో తమకు నచ్చినంత ఫీజును ప్రయివేటు ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైద్య పరీక్షలకు ఒక్కో ల్యాబ్, స్కానింగ్ సెంటర్ లో ఒక్కో ధరల అమలవుతోంది. ప్రయివేటు ఆసుపత్రులతో కుమ్మక్కై అవసరం లేకున్నా మూత్రపరీక్ష, రక్తపరీక్ష, పలు రకాల స్కానింగ్‌లను వైద్యులతో సిఫారసు చేయిస్తున్నారు. రోగులు తమకు నచ్చిన, తక్కువ ధరకు పరీక్షలు చేసే ల్యాబ్‌కు వెళ్లి టెస్టులు చేయించుకుంటే రిపోర్టులు సరిగా రాలేదంటూ వైద్యులు మళ్లి టెస్టులు రాసేలా ప్రయివేటు ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు చక్రం తిప్పుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
వైద్య పరీక్షల కోసం ల్యాబ్‌కు వెళితే ల్యాబ్ యజమానులు వేసిందే బిల్లు అన్న చందంగా పరిస్థితులు నెలకొన్నాయి. రక్త, మూత్ర పరీక్షలకు దాదాపు రూ.1500దాకా బిల్లు వసూలు చేస్తుండడం నిత్యకృత్యమైంది. ఇక ఏ చిన్న స్కానింగ్ టెస్టు అయినా రూ.2వేలపైనే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు సమర్పించుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ప్రయివేటు ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌ను మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉన్న ల్యాబ్‌లు సీబీపీ టెస్టుకు రూ.500 వరకు, క్రియాటిన్ టెస్టుకు రూ.350దాకా, ఎల్‌ఎఫ్‌టీకి రూ.800 దాకా వసూలు చేస్తున్నారు. మలేరియా టెస్టు చేస్తే కిట్ ధర కింద రూ.300దాకా వసూలు చేస్తున్నారు. డెంగీ కిట్ ధర రూ.150 ఉండగా… ఈ టెస్టుకు ప్రయివేటు ల్యాబ్‌లు రూ.1000దాకా రోగుల నుంచి పిండుకుంటున్నారు. ఇక సీటీ స్కాన్ కోసం రూ.2500 దాకా మోస్తారు పట్టణాల్లోని స్కానింగ్ సెంటర్లు కూడా వసూలు చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.