Friday, November 22, 2024

Vemulawada – రాజ‌న్న స‌న్నిధిలో సీతారాముల క‌ల్యాణం …

వేముల‌వాడ – శ్రీ రామనవమి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదర్శమూర్తులైన శ్రీ సీతారాముల కళ్యాణం కనులారా చూసిన భక్తజనం పులకరించిపోయారు. అలవైకుంఠం ఇలకు దిగివచిందన్నట్లుగా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. అందంగా అలంకరించబడ్డ కళ్యాణ వేదికలో వేద పండితుల మంత్రోత్చరణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాలతో కళ్యాణం వైభవంగా జరిగింది. పెళ్లి వేదికపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శ్రీ సీత రామచంద్రమూర్తి భక్తులకు దర్శన మిచ్చారు.

విశ్వక్సేన పూజతో మొదలై ఆగమ శాస్త్ర ప్రకారంసంప్రదాయ పద్దతిలో ఆద్యంతం సాగిన కల్యాణ తంతును భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన కళ్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహించారు. హరిహర క్షేత్రమైన రాజన్న ఆలయంలో అశేష శివపార్వతులు గంటా గదాశూలాన్ని జయ జయ ధ్వానాలు చేసుకుంటూ ఊపుతుంటే ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

రాజన్న ఆలయం తరుపున ఈఓ కృష్ణప్రసాద్, మున్సిపల్ శాఖ తరపున కమిషనర్ అన్వేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం జరుగుతున్నంత సేపు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హిజ్రాలు ఒకరికి ఒకరు తాళి కట్టుకుని తలంబ్రాలు పోసుకున్నారు. కల్యాణాన్ని దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లాపరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement