Monday, November 11, 2024

Vemulawada రాజన్న సన్నిధిలో నూతన కలెక్టర్ ప్రత్యేక పూజలు

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని నూతనంగా విధులు చేపట్టిన కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ అనురాగ్ జయంతి బదిలీపై కరీంనగర్ వెళ్లారు. ఆయన స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ జా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు నూతన కలెక్టర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతన కలెక్టర్ మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు స్వామివారికి సేవలందించే భాగ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్,గౌతమి, ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లతోపాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది నూతన కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ అర్చక బృందం ఆశీర్వచనం కావించి స్వామివారి చిత్రపటం మహా ప్రసాదం అందజేసి సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement