Tuesday, November 26, 2024

ఆడబిడ్డలకు అండ కేసీఆర్ – మంత్రి వేముల

ఉమ్మడి నిజామాబాద్, ప్రభన్యూస్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మహిళ కేంద్రంగానే రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాల్ లో బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడి టీచర్లు,అంగన్ వాడి సూపర్ వైజర్లు, వివోఏ లు,సిసి లు, ఆర్ పి, ఏఎన్ ఎం,ఆశావర్కర్లు, మంత్రి సతీమణి నీరజా రెడ్డితో కలిసి మహిళ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. వారి సేవలు, పని తీరును ప్రశంసించారు.

ఈ సందర్బంగా మంత్రి సొంత తన ఖర్చులతో సుమారు 1000 మందికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం సతీసమేతంగా వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.మహిళా సాధికారత కోసం సీఎం కేసిఆర్ మాదిరిగా ప్రపంచంలోనే మరెవరు ఆలోచన చేయలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసిఆర్ కిట్ తో మొదలై, వృద్యాప్యంలో ఆసరా పెన్షన్ వరకు ఎన్నో మానవీయ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ప్రతినెలా 28వేల మంది బీడీ కార్మికులకు రూ. 5కోట్ల 65 లక్షలు, 2016మంది ఒంటరి మహిళలకు రూ. 4లక్షల 65వేలు, 12వేల765మంది వితంతువులకు రూ. 2కోట్ల 57లక్షలు, 4242 వృద్ధాప్య పెన్షన్లకు రూ. 85 లక్షలు, 10వేల మందికి షాదిముబారక్, కళ్యాణ లక్ష్మి కింద రూ. 100 కోట్లు, కేసిఆర్ కిట్ కింద 12 వేల చొప్పున ఇప్పటి వరకు నేరుగా బాల్కొండ నియోజకవర్గ మహిళకు రూ.900 కోట్ల లబ్ది జరిగిందని మంత్రి వెల్లడించారు. ఇవే కాకుండా 19 నూతన అంగన్వాడి బిల్డింగ్స్, రూ. 3కోట్లతో 52 మహిళ భవనాలు నిర్మించామన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ గతంలో అంగన్వాడి జీతాలు రూ.4500 ఉంటే దాన్ని రూ.10వేల 500 చేసి, మళ్ళీ రూ. 13,650 చేశారని గుర్తు చేశారు. ఏఏన్ఎం ల జీతాలు రూ. 4వేలు ఉంటే రూ. 27వేలు చేశారని, ఆశావర్కర్లకు రూ.1500 ఉంటే రూ.9,750 చేశారని, హోంగార్డులకు రూ.12వేలు ఉంటే రూ.30వేలు, విఓఏ లకు రూ.2000 ఉంటే రూ.5,900, అంగన్వాడి హెల్పర్స్ కు రూ. 4500 ఉంటే రూ.7వేల 500 చేశారని తెలిపారు. 2014 నుండి మహిళ సంఘాల 6వేల గ్రూపులకు సుమారు రూ. వెయ్యి కోట్లు, ఈ ఒక్క సంవత్సరంలోనే రూ. 281 కోట్లు రుణాలు ఇచ్చామని తెలిపారు. ఒక్క గ్రూప్ కి రుణపరిమితి రూ.5లక్షల నుండి రూ.20 లక్షలు చేశామని చెప్పారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని సీఎం కేసిఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారు అన్నారు.

. “యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అని తెలిపారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని వారికి కావాల్సింది ప్రోత్సాహం అన్నారు. అందుకే అన్ని రంగాల్లో మహిళలకు కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజా రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement