Tuesday, November 19, 2024

ప్రతి ఎకరానికి సాగు నీరు … వ్యవసాయం పండుగ చేసిన కేసిఆర్ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్, ప్రభన్యూస్ బ్యూరో: ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి మండుటెండలో పొలాల నడుమ కాలినడకన ప్యాకేజ్ 21ఏ పనులను పరిశీలించారు. ఎక్కడైతే సరిగా పనులు జరగడం లేదో వాటిపై అధికారులకు సూచనలు చేశారు.

వేల్పూర్, భీంగల్ మండలాల్లోని పచ్చల నడ్కుడ, వాడి కొత్తపల్లి, చెంగల్, బిబి తండా, ఎం.జి తండా గ్రామాల్లోని వాటర్ డిస్ట్రిబ్యూటరీ బాక్స్ లు, ఓఏంఎస్ (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టం) లను పరిశీలించారు. ఒక్కో ఒఎంఎస్ ద్వారా 50పైగా ఎకరాలకు,ఒక్కో డిస్ట్రిబ్యూటరి ఛాంబర్ ద్వారా 12-15 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి వేముల తెలిపారు. ఇప్పటికే పచ్చల నడ్కుడ,వాడి కొత్తపల్లి,చెంగల్,బిబి తండా,ఎం.జి తండా గ్రామాల్లో 160ఓఎంఎస్ బాక్సుల నుండి 448 డిస్ట్రిబ్యూటరి చాంబర్స్ ద్వారా సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ మిషన్ ద్వారా ఇవి పని చేస్తాయన్నారు. చింతలూర్ వద్ద పెద్ద వాగుపై,బడా భీంగల్ కప్పల వాగుపై ట్యాపింగ్ పాయింట్స్ నిర్మాణాలను పరిశీలించి, 15 రోజుల్లో వాటిని పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి అదేశించారు. ఈ ట్యాపింగ్ పాయింట్ నిర్మాణాలు పూర్తి అయితే యాసంగి లో కూడా ఈ రెండు వాగులలో నీళ్లు వదిలి చెక్ డ్యామ్ లు నింపే అవకాశం ఏర్పడుతుందని, దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి వాగు పరివాహక పంట పొలాలకు కిలోమీటర్ల మేర బోర్ల రీజనరేషన్ ద్వారా సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు . ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారంతో ప్యాకేజీ 21 ద్వారా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే సుమారు రూ.1650 కోట్ల వ్యయంతో 71వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయని చెప్పారు. సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూటరి పైపు లైన్ వేసేందుకు రైతులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


…. చెక్ డ్యాంల పుణ్యం ప్రశాంత్ రెడ్డి సార్ దే – రైతు కొత్తూరు అంజయ్య

గతంలో నీటికి గోస ఉండే 9 బోర్లు వేసి అప్పుల పాలు అయిన కానీ సుక్క నీళ్లు రాలేదు. కానీ ఇప్పుడు మూడు బోర్లలో నీళ్లు వచ్చినయ్. ఒక్కటే బోర్ ద్వారా 5ఎకరాల పొలానికి నీళ్లు పారించుకుంటున్న. వానాకాలంలో అయితే బోర్ల నుంచి నీళ్లు పైకి ఎక్కి వచ్చినయ్. దీనికి ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్ సారు కట్టించిన చెక్ డ్యాంలే కారణమంటూ ఎంతో సంబురంతో ఆనందాన్ని రైతు అంజయ్య పంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 21ఏ పనుల పరిశీలనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పచ్చలనడ్కుడ గ్రామాల్లోని పొలాల్లో తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తుండగా… అక్కడు వచ్చిన రైతు కొత్తూరు అంజయ్య తన మనోగతాన్ని మంత్రితో పాటు అక్కడున్న వారితో ఇట్లా పంచుకున్నారు. రైతుల ఇలా సంతోషంగా మాట్లాడుతుంటే నిద్రహారాలు మాని రైతుల కోసం పడ్డ శ్రమ మర్చిపోవడమే కాకుండా ఆత్మసంతృప్తి కలుగుతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంతోషం కోసం కేసిఆర్ ఏం చేయడానికైనా వెనుకాడరని అన్నారు. మంత్రి వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement