సర్జిపూల్ నుంచి పోటెత్తిన వరదనీరు
బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచిన అధికారులు
పంప్‌హౌజ్ నుంచి నీరు ఎత్తిపోసే చర్యలు
డీ వాటరింగ్ తర్వాత నష్టం అంచనా వేసే చాన్స్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ప్రవాహం పోటెత్తుతోంది. చెరువులు అలుగు పారుతుండడంతో కాల్వల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక.. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పీఆర్‌ఎల్‌ఐ పథకంలోని వట్టెం పంప్‌హౌస్ నీట మునిగింది. నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్‌హౌస్‌లోకి వరద నీరు చేరింది. ప్యాకేజీ-7లోని ఆడిట్ నుంచి పంప్‌హౌస్ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్‌కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది.
సర్జిపూల్ గేట్ల నుంచి పంప్‌హౌజ్‌లోకి..
వట్టెం పంపింగ్ స్టేషన్‌లో మొత్తం 10 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు నాలుగు మోటార్లు బిగించారు. మరో మోటారు నిర్మాణ దశలో ఉంది. భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని గొలుసుకట్టు చెరువులు భారీ వరదతో పొంగిపొర్లాయి. తూడికుర్తి, శ్రీపురం, నాగనూలు చెరువులు నిండి అలుగు పారాయి. ఈ చెరువుల సమీపంలో పీఆర్‌ఎల్‌ఐ పథకం టన్నెల్ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన మార్గం మీదుగా ఈ చెరువుల వరద నీరు సర్జిపూల్‌లోకి వచ్చి.. గేట్ల ద్వారా పంపుహౌస్‌లోకి వెళ్లింది. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచినట్టు సమాచారం. ప్రస్తుతం డీ వాటరింగ్ చేస్తున్నారు. ఈ నీళ్లన్నీ బయటకు వెళ్లిపోతే ఎంత మేర నష్టం వాటిల్లిందో స్పష్టత రానుంది.