ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్): పోయిన ఎన్నికల్లో మెదక్ వచ్చినప్పడు నేను ఒకటే మాట మీతో మనవి చేయడం జరగింది. పద్మ నా బిడ్డ, ఆమె అడిగితే నేను ఏదీ కూడా కాదనే పరిస్థితి ఉండదు. దాని ఫలితమే ఇంద్ర భవనం లాంటి కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు ఇవ్వాల చూస్తున్నారు. ఉద్యమంలో నాతో పాటు కలిసి ఉండి.. ఇవ్వాల్టి వరకు మనతో కలిసి ఉన్న బిడ్డ పద్మక్క. ఇప్పుడే నన్ను ఆమె కోరింది. మెదక్ పట్టణంలో రోడ్లు చిందరవందరగా అయ్యాయి. వాటిని బాగు చేసుకోవాలే.. పంచాయతీలకు కూడా నిధులు కావాలనే అడిగింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగింది. మీకు ఎల్లుండి సాయంత్రంలో లోగా శాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తానని మాట ఇస్తున్నా.
రామాయంపేటలో డిగ్రీ కాలేజీ కూడా కావాలని కోరారు. అది కూడా మంజూరు చేస్తున్నా. మెదక్‌కు రింగ్‌రోడ్డు కూడా మంజూరు చేస్తున్నా.. అదేవిధంగా, ఏడు పాయల టెంపుల్ దుర్మగామాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో వంద కోట్ల రూపాయలు కావాలని అడిగారు.. దానికి కూడా మంజూరు ఇస్తున్నా.. కౌడిపల్లిలో కూడా డిగ్రీ కాలేజీ అడిగారు. దానికి కూడా మంజూరు చేస్తున్నా.. మెదక్ జిల్లాలో ప్రతి పంచాయతీకి నిధులుమంజూరు చేస్తున్నా.. అదేవిధంగా.. నాలుగు మున్సిపాలిటీలకు నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ కు తలా 25కోట్లు.. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఫండ్స్‌తో పనులన్నీ చేయాలని చెబుతున్నా.
ఇగ ఇప్పుడు మీ పని అయిపోయింది.. ఇగ నాపని ఉన్నది.. మిమ్మల్నందరినీ కోరేది ఒక్కటే.. ఎవరూ ఆగమాగం కావద్దు.. పంట కోతలయినంక గంగెడ్ల వారు వచ్చినట్టు వస్తుంటరు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వారు కోరుతున్నారు. ఇప్పటికే వారికి చాలా చాన్స్‌లు ఇచ్చినం.. ఎవరూ గణపురం కాల్వలను బాగు చేయలే.. అప్పడు తుమ్మ చెట్ల మొలిచినయ్.. మనం గణపురం కాల్వలు బాగుచేస్కున్నమ్. 40లక్షల ఎకరాల దాకా నీరు అందుతోంది. మంచిగ పంటలు పండుతున్నయ్.. గణపురం ఆయకట్టు కింద ఒక గుంట కూడా దెబ్బతినకుండా పంటలు పండిస్తున్నమ్.
తెలంగాణ రాకముందు చెట్టుకొక్కరు గుట్టకొకరు అయ్యారు. అందరం బాధపడ్డాం. రైతులను బాగు చేయాలనే సంకల్పం తీసుకుని దానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ వచ్చినం. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు మేలు చేసినం. కాళేశ్వరం జలాలతో పంటపొలాలకు నీళ్లు పారుతున్నయ్.
కేసీఆర్ సీఎం కావడం వల్లే మెదక్ జిల్లా సాధ్యమయ్యింది: మంత్రి హరీశ్‌రావు
మెదక్ జిల్లా కావాలనేది కొన్ని దశాబ్దాల కల.. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ మాట ఇచ్చారు. ఏండ్లు గడిచాయి కానీ జిల్లా కల నెరవేరలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. అది కొన్ని రోజుల్లోనే నేరవేరింది. జిల్లా పోలీసు ఆఫీసు, కలెక్టరేట్ భవన సముదాయం, మెడికల్ కాలేజీ, రైలు అన్నీ మెదక్‌కు వచ్చాయి. ఇవన్నీ కేసీఆర్ సీఎం కావడం వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పదికి పది మందిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్ కోరారు.