హైదరాబాద్‌కి చెందిన బయోలాజికల్-ఈ సంస్థ మరో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నది. ఓరల్ కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అంతర్జాతీయ వ్యాక్సిన్ ఇన్స్‌టిట్యూట్ (ఐవీఐ), బీఈ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. బీఈ సంస్థకు ఓసీ-వీఎస్‌కు చెందిన టెక్నాలజీని ఐవీఐ సంస్థ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నది. సురక్షితమైన, సమర్థవంతమైన, అందరికీ అందుబాటులో ఉండే రీతిలో ఐవీఐ సంస్థ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. అయితే నోటి ద్వారా వేసుకునే కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం గత ఏడాది నవంబర్‌లో ఐవీఐ, బీఈ మధ్య లైసెన్స్ అగ్రిమెంట్ జరిగింది.
ఆ ఒప్పందం ఆధారంగా నేటి నుంచి ఐవీఐ సంస్థ టెక్నాలజీ బదిలీ ప్రారంభించింది. బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన ల్యాబరేటరీల్లో ఆ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కలరా వ్యాధి విస్తరిస్తున్నదని, ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకే వ్యాక్సిన్ తయారు చేయాలన్న సంకల్పంతో ఐవీఐ, బీఈ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీకా తయారీ కోసం జరిగే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ 2025 నాటికి ముగుస్తుందని బీఈ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు కావాల్సిన కలరా వ్యాక్సిన్‌ను బీఈ సంస్థే ఉత్పత్తి చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కలరా నియంత్రకు బీఈతో ఒప్పందం
పేదరికంతో ముడిపడి ఉన్న కలరా లాంటి కొన్ని ఇన్‌ఫెక్షన్ వ్యాధులను నియంత్రించేందుకు తాము బీఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐవీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీరోమ్ కిమ్ తెలిపారు. కలరా టీకా ఉత్పత్తి కోసం ఐవీఐతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరంగా ఉందని బయోలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమ ధాట్ల తెలిపారు. కేవలం వ్యాధులను నియంత్రించడమే మా లక్ష్యం కాదు అని, ఐవీఐతో ఒప్పందం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాలను అందుబాటులోకి తీసుకురావడం తమ ఉద్దేశం అని మహిమ పేర్కొన్నారు.