Saturday, November 23, 2024

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి : హరీశ్‌ రావు

నిజామాబాద్‌, (ప్రభ న్యూస్‌) : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఒక్క మనిషి కూడా మిగులకుండా ప్రతి ఒక్కరికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు. బుధవారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ని ప్రతి గ్రామం ఏదీ వదలకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు.

వందకు వంద శాతం మొదటి డోస్‌, రెండో డోస్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉంటే రూరల్‌లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని పెట్టుకుని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఏ జిల్లా కూడా వ్యాక్సినేషన్‌ లో వెనుకపడకూడదన్నారు. వికారాబాద్‌ జిల్లాలో వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాలన్నారు. ప్రతి డీఎం అండ్‌ హెచ్‌వో ఫీల్డ్‌లో ఉండి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

వారం తర్వాత కలెక్టర్లతో ఈ విషయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌ గా ఉండేలా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దారని, అదే స్ఫూర్తితో వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా పని చేయాలన్నారు. టీమ్‌ వర్క్‌ తో ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌ లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement