న్యూ ఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నిరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, అదానివి ఎన్ని లక్షల కోట్లు ఆవిరై పోయాయి. చోక్సీ భాయి చోక్సీ భాయి అని మాట్లాడారు కదా. చోక్సీ భాయిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకుంటూ… రెడ్ కార్పెట్ వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. కొందరు దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి… తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
”తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డపై బాధ్యతగల వ్యక్తిగా కిషన్ రెడ్డి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం. ఏ ఆధారం లేకుండా ముందే ఉంహించి నవంబర్‌లోనే సెల్‌ఫోన్ ఉన్నాయా లేవా అంటూ.. నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఫోన్లు కావాలని ఈడీ సోమవారం అడిగితే, ఈ రోజు తీసుకెళ్లింది. ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అవసరం కవితకు లేదు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఆయన తెలంగాణకు రాని మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ ప్రతిష్ఠకు భంగం కలిగించారు. అసభ్యకరంగా మాట్లాడారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మేము ఇచ్చిన లేఖపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పి క్షమాపణ కోరాలి. దేశంమీద గౌరవం ఉంటే… దేశాన్ని దోచుకునే వాళ్ళను ఢిల్లీ గడ్డపై ఉరితీయండి. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాల్సి ఉంది. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని చెప్పిందే కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ బిడ్డ సింహం లా గర్జిస్తుంది. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై పుట్టిన పులి బిడ్డ ఎమ్మెల్సీ కవిత” అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.