Friday, November 22, 2024

ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్: కేసీఆర్ సర్కార్ పై ఉత్తమ్ ఫైర్

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు చేయమంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీ.పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం నల్గొండలోని బత్తాయి మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి అంటూ అధికారులకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రైతులు 16 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చిన ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. వ్యవసాయం చేసే వారిలో అత్యధికంగా వరి రైతులు ఉంటే..వరి కొనుగోలు చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టుల మీద, వాటి కమిషన్ ల మీద వున్న శ్రద్ధ రైతుల మీద లేదని మండిపడ్డారు. ప్రతి గింజను 1960 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. వరి వేసుకోవద్దని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈవిషయంలో తాము రైతులకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. పంట బీమా పథకం దేశవ్యాప్తంగా ఉందన్న ఉత్తమ్..  రుణమాఫీ, క్రాఫ్ ఇన్సూరెన్స్ లేదన్నారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ లో ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఉత్తమ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement