హైదరాబాద్ – రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ఆయన అభిలషించారు.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి తో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా ఇవాళ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలని వీసీలను కోరారు. యూనివర్సిటీలను 100శాతం ప్రక్షాళన చేయాలని, ఆ దిశగా దృష్టి సారించాలన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు రేవంత్..
యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలని కోరారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు.. విద్యార్ధులకు ఉపాది లభించే విధంగా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలసిన అవసరం ఉందని తన మనసులోని మాటను చెప్పారు… స్కిల్స్ అభివృద్ధి చేసుకునేలా విద్యా బోధనల ఉండాలని సూచించారు.
మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుందని అదేవిధంగా ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు… తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకునేందకు కూడా వెనుకాడబోనని ఇదే సందర్భంగా సుతిమెత్తగా హెచ్చరించారు.
యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలన్నారు.. ఎప్పటికప్పుడు విద్యార్ధుల నడవడిక గమనిస్తూ ఉండాలని అన్నారు..డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్దులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని మంచి మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత కూడా అధ్యాపక వర్గంపైనా, వైస్ చాన్సలర్లపైనా ఉందని పేర్కొన్నారు సిఎం.కాగా, వరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదన్న రేవంత్ . మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక చేశామని అన్నారు… బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ.శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తో పాటు ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా), ప్రొ. ప్రతాప రెడ్డి (కాకతీయ), ప్రొ. జీఎన్ శ్రీనివాస్ (పాలమూరు), ప్రొ. నిత్యానంద రావు (తెలుగు), ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), ప్రొ. యాదగిరి రావు (తెలంగాణ), ప్రొ. అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), ప్రొ. రాజిరెడ్డి (కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ), ప్రొ. ఉమేష్ కుమార్ (శాతవాహన), ప్రొ. సూర్య ధనుంజయ (మహిళా వర్సిటీ), ప్రొ. గోవర్దన్ (బాసర ఐఐఐటీ) పాల్గొన్నారు.