నాంపల్లి నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీని గెలిపించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గుడిమల్కాపూర్ నుంచి మెహిదీపట్నం, పద్మనాభనగర్‌లో బైక్‌ర్యాలీ రోడ్‌షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని తెలిపారు. దేశ ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతున్న మహోన్నతమైన వ్యక్తి నరేంద్రమోదీ అని ఆయన కొనియాడారు. మూడోసారి నరేంద్రమోదీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశం కోసం.. పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులు లేవు.. మత ఘర్షణలు లేవు అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం పదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు.
రాష్ట్రంలో వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. ఇక్కడ చాలదన్నట్లు కూతురు ఢిల్లీకి వెళ్లి మరీ దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. తప్పు చేసింది కాబట్టే ఇప్పుడు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే వెన్నుపోటు పార్టీ అని తెలిపారు. దేశంలో స్థిరమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలే ఉంటాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ చేయని కుంభకోణం లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.