బీసీ జనగణన చేపట్టి వారి జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో బీసీల వాటా వారికి కల్పించాలని అందుకోసం బీసీ సంఘాలు ఐక్యపోరాటాలు చేయాలని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. బీసీ జనగణన చేపట్టి, చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాచేయనున్నట్టు తెలిపారు. దీనికి శనివారం వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాసమల్ల లక్ష్మణ్ నాయకత్వంలో తరలివెళుతున్న వారికి మద్దతుగా కూరపాటి వెంకటనారాయణ కాజిపేట రైల్వే స్టేషన్ కు వచ్చి మాట్లాడారు.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, బహుజన మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పటేల్ వనజ మాట్లాడుతూ బిసి జనగణన చేపట్టకుండా అన్ని రంగాల్లో అణచివేస్తున్న పాలక పార్టీలకు బిసిల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, బిసి లకు అన్ని రకాల హక్కులు, అవకాశాలు కల్పించిన వారికే ఓట్లు వేయాలని కోరారు. బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం, హక్కుల సాధన కోసం దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలు చేయాలని, తరతరాలుగా ఉత్పత్తిలో, సేవలో సర్వ చాకిరి చేస్తున్న బిసి లను పాలకవర్గాలు కావాలనే అణచివేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..