Tuesday, November 19, 2024

కేసీయార్ చెప్పేదొకటి… చేసేదొకటి, మండిపడ్డ కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానపరిచేలా, అవహేళన చేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీయార్ తీరును తప్పుబట్టారు. బడ్జెట్ మీద స్పందిస్తూ కేసీయార్ మాట్లాడిన తీరు ఆయన అసహనాన్ని బయటపెట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి ప్రధాన మంత్రిపై చేసిన వ్యాఖ్యలు, బూతులు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. హుజురాబాద్ ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు నుంచే కేసీయార్, ఆయన కుటుంబ సభ్యులు, టీఆరెస్ నేతలు ఒక పథకం ప్రకారం బీజేపీ మీద విషం జల్లే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. వంతులవారిగా మంత్రులు, నేతలు, అప్పుడప్పుడూ సీఎం కేసీయారే స్వయంగా తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీయార్ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం, అనైతికం, అవమానకరమని కిషన్ రెడ్డి అన్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైతే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో, నాటి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేసిందో, ఏ రాజ్యాంగం ప్రకారం కేసియార్ పార్టీ పెట్టుకున్నారో.. ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్‌ను అవమానిస్తూ, అవహేళన చేసేలా మాట్లాడారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్త చేశారు. కేసియార్ ప్రకటనను సమాజంలోని రాజకీయ విశ్లేషకులు, కవులు, కళాకారులు ఖండించాల్సిన అవసరముందని అన్నారు. ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడినా, సీఎం అయ్యాక సంయమనం పాటించాలని, హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.

ప్రధాని వేసుకునే దుస్తులు, ఒక నమ్మకంతో పెంచిన గడ్డం మీద కూడా కేసియార్ గేలి చేస్తూ వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత దాడిగా పరిగణించాలని కిషన్ రెడ్డి అన్నారు. కేసియార్ చెప్పేదొకటి, చేసేదొకటి అని, నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడే అబద్ధాలు ఎప్పటికీ నిజం కావని అన్నారు. ఈటల విజయం తరువాత సీఎం కేసియార్‌లో, ఆయన కుటుంబంలో అభద్రతభావం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రెండున్నర గంటల పాటు సీఎం కేసీయార్ నిర్వహించిన మీడియా సమావేశం గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలను ప్రదర్శించినట్టుగా ఉందని విమర్శించారు.

తప్పుడు ప్రచారంతో తప్పుదారి పట్టించొద్దు

కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కల్గిన కేసీయార్, బడ్జెట్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేసీయార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏ బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చు వేరుగా ఉంటుందని గుర్తుచేశారు. ఆ విషయం కేసీయార్‌కు తెలుసని, అయినా సరే ఎరువుల సబ్సిడీ సహా అనేకాంశాలపై తప్పుదారి పట్టించేలా మాట్లాడారని మండిపడ్డారు. నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వమే ఎరువులపై సబ్సిడీ ఇస్తోందని, రాష్ట్రాలు నయాపైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని, అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే, ఆ భారం మొత్తం కేంద్రమే భరిస్తూ రైతులకు అందజేసిందని గుర్తుచేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ 33% పెంచారని, సబ్సిడీ తగ్గించారని కేసీయార్ చెప్పడం అర్థరహితమని అన్నారు. ఆచితూచి, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు.

- Advertisement -

రామగుండంలో రూ 6,000 కోట్లతో కేంద్రం ఎరువుల ఫ్యాక్టరీ అందుబాటులోకి తీసుకొస్తోందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోత విధించారు అనేది నిజం కాదని వివరణ ఇచ్చారు. గత ఏడాది తరహాలో రూ. 73 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే ఈ ఏడాది అదనపు పని దినాలు కల్పించామని అన్నారు. గత ఏడాది బడ్జెట్ అంచనాలను మించి రూ. 98 వేల కోట్ల వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం ఖర్చు చేసిన విషయాన్ని విస్మరించవద్దని కిషన్ రెడ్డి తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే..

దేశాన్ని పరిపాలించే సత్తా, సామర్థ్యం కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మరెవరికీ లేదన్నట్టుగా కేసీయార్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో 60 వేల టీఎంసీలు నీరు ఉందని, కేవలం 30 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని కేసీయార్ స్వయంగా చెబుతూ, నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. నదుల అనుసంధానం అనేది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, అనేకమంది మేధావులు, నిపుణులు అనేక అధ్యయనాలు చేసి తీసుకున్న నిర్ణయమని గుర్తుచేశారు. విమర్శించే ముందు కేసీయార్ తాను చేసిన వాగ్దానాలు, తప్పిన మాటల గురించి ఆలోచించాలని హితవు పలికారు. దళిత ముఖ్యమంత్రి వాగ్దానం నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ వరకు ఏదీ నెరవేర్చకుండా మాటలతో మాయచేసే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఇళ్లను నిర్మిస్తే, కేసీయార్ కనీసం 25 వేల ఇళ్లను కూడా నిర్మించి లబ్దిదారులకు అందించలేకపోయారని విమర్శించారు. ప్రజాస్వామ్యం లేని, సామాజిక న్యాయం జాడలేని రాష్ట్రంగా తెలంగాణను తయారుచేశారని మండిపడ్డారు. అడిగితే కేసులు, నిలదీస్తే జైలుకు పంపడాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement