Sunday, November 24, 2024

TS | కొత్త ప్రభుత్వంపై గంపెడాశతో నిరుద్యోగులు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్లపై గంపెడాశతో ఉన్నారు. వరుస నోటిఫికేషన్లు వెలువడతాయని, తక్కువ పోస్టులతో ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లకు అదనపు ఖాళీలను కలిపి కొత్తగా మళ్లి నోటిఫికేషన్లు జారీ చేస్తారనే అభిప్రాయాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మళ్లి నోటిఫికేషన్‌ వేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 5089 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో వాటికి ఇంకా పరీక్షలను నిర్వహించలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్‌ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని నిరుద్యోగులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

గత ప్రభుత్వం సెప్టెంబర్‌ 6న 5089 టిచర్‌ పోస్టులకు సంబంధించి డీఎస్సీ (టీఆర్టీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి 1.75 లక్షల మంది ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు తక్కువగా ఉండడంతో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదు. దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు గత 6 సంవత్సరాలుగా టీచర్‌ పోస్టుల కొరకు గంపెడాశతో ఎదురు చూస్తుంటే 2022 మార్చ్‌ 9న అసెంబ్లీలో అప్పటి సిీఎం కేసీఆర్‌ 13 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించి చివరకు ఎన్నికల ముందు కేవలం 5089 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

- Advertisement -

దీంతో టీచర్‌ పోస్టులు పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పోస్టుల సంఖ్యపై స్పందించలేదు. పైగా పరీక్షలను నవంబరు 20 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించేశారు. కానీ అంతలోనే ఎన్నికల కోడ్‌ రావడం పోలింగ్‌ నవంబరు 30న ఉండడంతో అభ్యర్థుల డిమాండ్‌ మేరకు పరీక్షలు వాయిదా వేశారు. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నాగానీ, ఇంతవరకూ తేదీలు ఖరారు కాలేదు.

కానీ అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో డీఎస్సీ పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. అప్పట్లో నిరుద్యోగులకు మద్దతుగా మెగా డీఎస్సీ వేయాలని చాలా సార్లు కాంగ్రెస్‌ నాయకులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డితోపాటు ఇంకా అనేక మంది నాయకులు కేసీఆర్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వాళ్ల ప్రభుత్వమే రావడంతో 5089 పోస్టులతో వెలువడ్డ నోటిఫికేషన్‌ను నిలిపివేసి, మరో 20 వేల టీచర్‌ పోస్టులు వాటికి జత చేసి మెగా డీఎస్సీ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒకవేళ అలాకాకుండా ఈ 5089 పోస్టులకే ముందు నియామక ప్రక్రియ చేపట్టినా ఎవరోకరు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు కేసులంటూ పిటిషన్లు దాఖలు చేస్తే ఈ ప్రక్రియ కాస్త సంవత్సరాల కొద్దీ సాగుతుందనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉద్యోగాల భర్తీ పూర్తయితే గానీ మళ్లి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదని, దానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో తెల్వదని నిరుద్యోగులు అంటున్నారు.

కాబట్టి ఇప్పుడే పోస్టులను జత చెసి మరోకసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ కూడా నెరవేర్చినట్టు- ఉంటు-ందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అయితే ప్రకటించిన పోస్టులకే పరీక్షలు నిర్వహించాలా? లేక కొత్త నోటిఫికేషన్‌ వేయాలా? అనే దానిపై కొత్త ప్రభుత్వం ఏర్పాటై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటిలోగా ప్రకటించిన పోస్టులకు ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే అవకాశం మాత్రం కనబడటంలేదు.

పోస్టులు జత చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలి : ఆర్‌.రామ్మోహన్‌ రెడ్డి, డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు..

ఆర్‌.రామ్మోహన్‌ రెడ్డి, డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు తక్కువ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత ప్రభుత్వం జారీ చేసింది. ఖాళీ పోస్టులు ఇంకా చాలానే ఉన్నాయి. వాటిని కూడా 5089 పోస్టులకు జతచేసి రీనోటిఫికేషన్‌ జారీ చేసి అప్పుడే పరీక్షలు నిర్వహించాలి. ఎన్నికల్లో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలి. నాలుగు లక్షల మంది డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు, వాళ్ల కుటు-ంబ సభ్యులు ఎనికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచారు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement