Tuesday, November 19, 2024

ఖ‌మ్మంలో అనుమతి లేని హాస్పిట‌ళ్లు సీజ్.. ప‌లు ఆస్ప‌త్రుల‌కు నోటీసులు జారీ!

నిబంధనలకు విరుద్ధంగా న‌డుపుతున్న ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా జులిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. తొలుత డీఎంహెచ్ ఓ డాక్టర్ మాలతి, డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో వైరారోడ్లోని స్వాతి ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడ పేషంట్లకు తాలూకు సరైన రికార్డులు నిర్వహించకపోవటాన్ని గుర్తించారు. ఎక్కువ మంది పేషంట్లు వచ్చినా, రికార్డుల్లో తక్కువగా ఉన్నట్లు చూపించి మిగితా వారిని వేరే ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు.

దీంతో ఆసుపత్రి యాజమన్యానికి నోటీసులు జారీ చేశారు. అనంతరం అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ను తనిఖీ చేశారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహిస్తుండటాన్ని గుర్తించారు. అంతే కాకుండా బయో మెడికల్ వ్యర్ధాలు ల్యాబ్లో పేరుకు పోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్త షాంపుల్స్ నిల్వ ఉండటంపై యాజమాన్యాన్ని ప్రశ్నించి ల్యాబ్ను సీజ్ చేశారు. అలాగే అదే ప్రాంతంలో అనుమతులు లేకుండా నడుపుతున్న దంత వైద్యశాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ డాక్టర్ మాలతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయివేటు ఆసుపత్రులు, డయోగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేస్తున్నామన్నారు.

అందులో భాగంగా సోమవారం నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిని సీజ్ చేశామన్నారు. ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా, రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ప్రయివేటు ఆసుపత్రుల యాజమన్యాలను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హరికృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement