భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవ్వాల (బుధవారం) సాయంత్రానికి 45 అడుగులకు చేరుకుంది. గంట, గంటకు వేగంగా వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఇదే క్రమంలో గోదావరి నీటి మట్టం పెరిగితే ఇవ్వాల రాత్రి 10 గంటల లోపు భద్రచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. 48 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరికి ఉప నదులు అయిన ప్రాణహిత, ఇంద్రవంతి, పెన్‌గంగా, తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి అన్ని ఉపనదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా సమీపంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి 2లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయడం ఇదే మొదటి సారి. మేడిగడ్డ 5.7 లక్షలు, సమ్మక్క బ్యారేజ్ 7.8 లక్షల క్యూసెక్కుల నీటితో చింతురు వద్ద 31 అడుగులకు చేరుకున్న శబరి గోదారి, ఉహించిన దానికంటే ఎక్కువ ఉధృతి నెలకొన్నది.
పోలవరం వద్ద గోదావరి వరద 11.5 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 7.3 లక్షలు క్యూసెక్కు ల నీటిని క్రిందకు వదులుతున్నప్పటికీ వాగులు, వంకలు అనూహ్యంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు గ్రామాల రహదారులు నీటితో నిండిపోయాయి, చర్ల, చింతూరు, వీఆర్ పురం, ఏటూరునాగారం, వరంగల్, వెంకటాపురం, ఛత్తీస్‌గఢ్ ఏరియాల్లో రహదారులు మునిగిపోయాయి. పోలవరం ప్రాజెక్టుతో గోదావరి తగ్గుముఖం పట్టకుండా ఉండడంతో భవిష్యత్ లో కూడా ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇక.. ఇవ్వాల రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47.10 అడుగులకు చేరుకుంటుందని సెంట్రల్ వాటర్ కమిటీ అంచనా వేసింది.