Thursday, December 12, 2024

Nalgonda | ఉదయ సముద్రం లిఫ్ట్.. లక్ష ఎకరాలకు సాగునీరు…

నల్గొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పైలాన్‌ను నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లేముల వద్ద శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన బ్రాహ్మణ వెల్లేముల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూజలు చేశారు. రూ.674.67 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 469 కోట్లు ఖర్చయ్యాయి. ఈ పథకం కింద దాదాపు అన్ని ప్రధాన పనులు పూర్తయ్యాయి, కాగా బ్యాలెన్సింగ్ నెట్ వర్క్ పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి.

ఈ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి మొదటి విడతలో బ్రాహ్మణ వెళ్లెముల ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. నల్గొండ జిల్లా లోని నార్కెట్ పల్లి, నల్గొండ, జ‌గిత్యాల, మునుగోడు, రామన్నపేట, కట్టంగూరు, శాలి గౌరారం మండలాలలోని లక్ష ఎకరాలు సాగవుతుంది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుట్ట సుఖేందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ, భువనగిరి ఎంపిలు కుందూర్ జయవీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంఎల్ఎలు వేముల వీరేశం, రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, బీర్ల ఐలయ్య, మందుల శామ్యూల్, నేతి విధ్యా సాగర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్, జిల్లా ప్రాజక్టుల ఈ ఎన్ సి అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement