Wednesday, November 20, 2024

రెన్యూవల్‌ చేయక రెండేళ్లు.. విద్యావ‌లంటీర్లను తీసుకోకుంటే ఈ ఏడాది కష్టమే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటుంది. ఇందులో భాగంగానే మన ఊరు-మన బడి, మన బస్తి కార్యక్రమంతోపాటు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టబోతుంది. అయితే ప్రభుత్వ విద్యలో కొన్నేళ్లుగా భాగస్వాములైన విద్యావాలంటీర్లను విద్యాశాఖ రెండేళ్లుగా పక్కనబెట్టేసింది. విద్యావాలంటీర్ల వ్యవస్థను ఉన్నట్టా? లేనట్టా? అనేదానిపై విద్యాశాఖలో స్పష్టత కరువైంది. కరోనా కారణంగా కొంతకాలంగా వాయిదా పడిన బడిబాట కార్యక్రమం జూన్‌ 1 నుంచి విద్యాశాఖ చేపట్టబోతోంది. ఇంగ్లీష్‌ మీడియం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. దీనికనుగుణంగానే పాఠాలు చెప్పే టీచర్లను నియమించాల్సి ఉంటుంది. కొత్తగా ఇప్పటికిప్పుడు టీచర్లను రిక్రూట్‌ చేసే పరిస్థితి లేదు. మరీ విద్యావాలంటీర్లనైనా తీసుకుంటారా అంటే అదీలేదు.

సర్కారు బడుల్లో వేల సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నా రెండేళ్ల నుంచి విద్యావాలంటీర్లను రెన్యువల్‌ చేయడంలేదు. టీచర్ల సర్దుబాటు తర్వాత మిగిలే పోస్టుల్లో విద్యావాలంటీర్లను తీసుకుంటామని చెప్పినా.. ఆ దిశగా ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 2019-20 విద్యాసంవత్సరంలో టీచర్ల ఖాళీలను బట్టి ప్రభుత్వం 16వేల మంది విద్యావాలంటీర్లను తీసుకుంది. ఉద్యోగాలు రావడం, కొంత మంది వదిలేసి వెళ్లడంతో దాదాపు 10వేల మంది వాలంటీర్లు ఉండేవారు. కానీ 2020లో కరోనా కారణంగా మార్చి నెలాఖరు నుంచి విద్యావాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. జూన్‌ 13 నుంచి ప్రారంభమయ్యే 2022-23 విద్యా సంవత్సరంలోనైనా వీరిని విధుల్లోకి తీసుకుంటారో..లేదో అధికారుల నుంచి ఇంత వరకు స్పష్టత లేదు.
రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ, లోక్‌బాడి పాఠశాలలు ఉంటే అందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఉపాధ్యాయులు 1.06 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు దాదాపు 21,500 వరకు ఉన్నాయి.ఈ విద్యా సంవత్సరం నుంచి అమలయ్యే ఇంగ్లీష్‌ మీడియం బోధనను బోధించాలంటే అదనంగా మరో 10వేల మంది వరకు టీచర్లు అవసరం ఉంటుంది.

విధుల్లోంచి తీసేసిన 10వేల విద్యావాలంటీర్లను తీసుకోకుండా ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యమయ్యే పనికాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. తెలుగు మీడియం సెక్షన్లకు సమాంతరంగా ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్లను కూడా ఈసారి ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ఉన్న టీచర్లతోనే తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బోధనను చెప్పించడం కుదరదు. ఈనేపథ్యంలో సార్లు లేని పాఠశాలలకు ఇస్తే టీచర్లనైనా ఇవ్వడి..లేదా విద్యా వాలంటీర్లనైనా విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌ను ఉపాధ్యాయ సంఘాలు, విద్యావాలంటీర్ల సంఘాల నేతలు లేవనెత్తుతున్నారు. విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకున్న అంతిమంగా విద్యార్థులకు న్యాయం జరిగేలా అధికారుల నిర్ణయాలు ఉండాలని పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement