అందుబాటులో మరో రెండు రైళ్లు
సికింద్రాబాద్ నుంచి విశాఖకు
విశాఖ నుంచి పూరికి కొత్త రైళ్లు..
10 వందే భారత్‌లను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ
గుజరాత్ నుంచి 85 వేల కోట్ల రైల్వే పనులకు శ్రీకారం
దక్షిణ మధ్య రైల్వే విభాగంలో మంగళవారం మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. మంగళవారం నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. అలాగే విశాఖ నుంచి పూరికి వెళ్లే వందేభారత్ తో పాటు ఈ రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ మంగళవారం పచ్చజెండా ఊపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మోదీ మొత్తం 10 వందేభారత్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం.
85వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు..
ఇదే సందర్భంగా రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్‌ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు.
51కి చేరిన వందేభారత్‌లు..
సికింద్రాబాద్-విశాఖ, కలబురగి-బెంగళూరుతో పాటు లఖ్‌నవూ-దేహ్రాదూన్, పట్నా-లఖ్‌నవూ, న్యూ జల్‌పాయ్‌గుడి-పట్నా, పూరి-విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజురహో-దిల్లీ, అహ్మదాబాద్-ముంబయి, మైసూరు-చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రధాని నేడు ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందేభారత్‌ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా దిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పది వందేభారత్‌లు అందుబాటులో ఉన్నాయి.
మోదీ పాలనలో రైల్వేలలో గణనీయమైన అభివృద్ధి: కిషన్ రెడ్డి
పదేళ్లలో దేశంలో రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారని కొనియాడారు. అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ – విశాఖ మార్గంలో రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కిషన్ రెడ్డి, వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఇవాళ మరో ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని.. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పారు.