నాలా దుర్ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అయితే వర్షంలోనే సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఇంటి నుంచి సోదరుడుతో కలిసి చిన్నారి మౌనిక బయటకు వచ్చింది. అయితే రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ఓపెన్ నాలాను గుర్తించకుండా మౌనిక సోదరుడు అందులో పడబోయాడు. అయితే సోదరుడిని రక్షించిన మౌనిక.. తాను నాలాలో పడిపోయింది. దీంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గాలింపు చేపట్టిన జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు.. సికింద్రాబాద్‌లోని పార్క్ లేన్ సమీపంలోని నాలాలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటననై జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. బేగంపేట డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణను జీహెచ్‌ఎంసీ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎగ్జక్యూటివ్ ఇంజినీర్ ఇందిరా భాయ్‌కు ఆదేశాలు జారీచేసింది. పది రోజుల్లో ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలిపింది.