Wednesday, November 20, 2024

TS | వచ్చే నెల అమల్లోకి మరో రెండు గ్యారెంటీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : విపక్షాల నుంచి ఒత్తడి మొదలు కాకముందే, ప్రజల్లో ప్రతికూలత ఏర్పడకముందే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తోంది. అదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నందున ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడానికి ముందుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది.

వీటి అమలుకు నిర్ధేశించుకున్న గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆరోగ్యశ్రీ వైద్య సేవల మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచి ఆరోగ్య రక్షణ కల్పిస్తోంది. ఈ క్రమంలో మిగతా గ్యారెంటీల్లో మరో రెండింటిని ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది.

- Advertisement -

ఆ మేరకు తాజాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. రూ.500కు వంట గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభించి మిగతా మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రూపంలో జమ చేయనున్నారు. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

అయితే, మహాలక్ష్మి పథకంలో రెండు ప్రాధాన్యత గల పథకాలు తక్షణమే అమలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో మహిళలకు రూ.2500 నగదు భృతి చెల్లించేందుకు భారీగా నిధుల అవసరం ఉంది. అయితే, ఒకవేళ ఆ స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యం కాకుంటే.. అంతకన్నా ముందు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

‘గృహ జ్యోతి’ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌లను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ జాబితాలను కూడా తెప్పించుకుంది. ఈ రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్‌ ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మహాలక్ష్మి గ్యారెంటీలోని మూడు అంశాల్లో ఒకటైన రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ను, గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అందజేయనున్నారు. సర్కార్‌ ఆదేశాలతో సివిల్‌ స్లప శాఖ, విద్యుత్‌ శాఖలు ఈ రెండు హామీల అమలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి..? ఎవరెవరికి సబ్సిడీ గ్యాస్‌ అందించాలి..? సెంట్రల్‌ గవర్నమెంట్‌ అందజేసే ఉజ్వల్‌ సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయి..? వంటి వివరాలను సివిల్‌ స్లప శాఖ తరువుగా అధ్యయనం చేస్తోన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజుల్లో రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ హామీ అమలుపై ఓ నివేదికను అధికారులు అందజేయనున్నారు. ఉచిత విద్యుత్‌తో ఎంత ఖర్చు వెచ్చించాల్సి ఉంటు-ంది..? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలి? అర్హులను ఎలా గుర్తించాలనే దానిపై కూడా విద్యుత్‌ శాఖ రిపోర్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిధులు సమకూర్చుకునే దిశగా కసరత్తు

గ్యారెంటీల అమలు క్రమంలో నిధులు సమకూర్చుకునే దిశగా రేవంత్‌ రెడ్డి సర్కారు కసరత్తు వేగవంతం చేసింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసిందని, ఏకంగా రూ.ఆరు లక్షల కోట్ల అప్పు పేరుకుపోయిందని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక నష్టాన్ని పూడ్చే చర్యలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ, వివిధ ఆర్థిక సంస్థల సహకారంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ముందుకు వెళుతోంది.

ఆరు గ్యారెంటీల అమలు కోసం విడతల వారీగా బడ్జెట్‌ను సమకూర్చుతూ ముందుకు సాగుతోంది. ఫిబ్రవరిలో అమలు చేయబోయే రెండు హామీలకు అవసరమైన నిధులు సమకూరాయని, అందుకే వెంటనే అమలు చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు గ్యారెంటీలల అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందనున్నదని విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అర్హుల గుర్తింపు పూర్తి, జాబితాలు రెడీ..

ప్రభుత్వం నిర్ణయం తీసుకుందే అడువుగా గ్యారెంటీలను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని కోణాల్లో సంసిద్ధమై ఉంది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించారు. ఆ సమాచారంతో జాబితాలు కూడా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన రెండు స్కీమ్‌ల కోసం ఎంపిక చేశారు.

ఇప్పటికే అప్లికేషన్ల డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయింది. పథకాల అర్హతను గుర్తించేందుకు ఆధార్‌ లింకు ద్వారా స్క్రూటినీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఇందుకు మార్గదర్శకాలు కూడా వెలువడనున్నాయి. ఆ మార్గదర్శకాలను అనుసరించి అర్హుల బితాలను పరిశీలించి వడపోయనున్నారు. అర్హులను ఎంపిక చేయనున్నారు. గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ రెండూ హామీలూ అర్హులుగా గుర్తించిన ఆయా కుటుంబాల్లోని మహిళల పేర్ల మీదనే అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement