- సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో 7 కేసుల చేధన
- అమరచింత యూనియన్ బ్యాంకులో చోరీ కేసులో నిందితులు పట్టివేత
- చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులకు రివార్డులు
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ గిరిధర్ రావు
వనపర్తి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : దొంగతనం చేసే చోట మాటు వేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారు. తాళం ఉన్న ఇళ్లను రెక్కి చేస్తారు.. అమాయక ప్రజలను చూసి మాటలతో మోసం చేస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసం, బ్యాంక్ చోరీ ప్రయత్నం, చోరీల కేసులు నమోదు అయ్యాయి.
బాధితుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఏడు కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో చేదించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదు, బంగారు ఇతర వస్తువులను స్వాదీనం చేసుకొని రిమాండుకు తరలించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ. గిరిధర్ రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో వెయ్యి మందికి టోకరా…
జల్సాలకు అలవాటుపడిన కొందరు యువకులు సులువుగా డబ్బులు సంపాదించాలని లోన్ యాప్ ద్వారా డబ్బులు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1000 మందిని మోసం చేసి రూ.2కోట్లు కాజేశారు.
బాధితుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో చాకచక్యంగా వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట, పానగల్, గద్వాల్ జిల్లాకు చెందిన 7మంది యువకులను పట్టుకొని వారి వద్ద నుంచి 6ఫోన్ లు, 4బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వెల్లడించారు.
అమరచింత బ్యాంక్ దొంగతనానికి స్కెచ్…
అమరచింత యూనియన్ బ్యాంక్‌ను దోచుకోవడానికి స్కెచ్ వేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వనపర్తి మండలం మెంటేపల్లికి అంకిత బిటెక్ చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు నుంచి రూ.18లక్షలు మోసం చేసింది. జల్సాలకు అలవాటు పడిన ఆమె ఆ డబ్బులతో గోవా, బెంగుళూరు తిరిగి ఖర్చు చేసింది. ఇక 2022లో అదే గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత అప్పులు అయ్యాయి. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, నాగరాజు, గణేష్ లకు డబ్బులు ఆశ చూపించారు. వాందరూ కలిసి గద్వాల్, నారాయణ పేట, మరికల్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో దొంగతానికి వెళ్లారు.
వీలు పడకపోవడంతో గత నెల 27న రాత్రి అమరచింత యూనియన్ బ్యాంకు వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ ఉడగొట్టి బ్యాంకులోకి వెళ్లి లాకర్ రూం పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో సిసి కెమెరాలకు ఉన్న డీవీఆర్ ఎత్తుకెళ్లారు.
బ్యాంకు చోరీ ప్రయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 5న అమరచింతలో వాహనాల తనిఖీ చేస్తుండగా.. కారులో ఉన్న ఐదుగురు నేరస్తులు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న డీవీఆర్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అమాయకులే వీరి టార్గెట్…
అమాయక మహిళలే వీరి టార్గెట్.. వారితో మంచిగా మాటలు కలిపి.. ఫుల్లుగా కల్లు తాగించి.. బైకులపై ఇంటికి తీసుకెళ్లి.. మత్తులో మునిగాక.. వారి ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో అక్కడి నుంచి ఉడాయిస్తారు.
దేవరకద్ర మండలం పేరూరు గ్రామానికి చెందిన చందు, మనోహర్ లు అమాయక మహిళలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 29న వనపర్తిలోని తిరుమల కాలనికి చెందిన ఇద్దరు మహిళలకు బంధువులం అని ఫుల్లుగా కల్లు త్రాగించారు.
వారు పడుకున్న తర్వాత ఒంటిపై ఉన్న 3 తులాల నగలు, 5వేల నగదు దొంగిలించి పారిపోయారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెల 5న ఆత్మకూరు మండలం పిన్నంచర్ల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు నేరస్తులు బైక్ పై పారిపోవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి బంగారు నగలు, రూ. 5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
7 చోరీ కేసులు చేదించిన పోలీసులు
జిల్లాలో ఇటీవల మోసాలు, చోరీ కేసులు పోలీసులకు సవాల్ గా మారాయి. ఇక జిల్లాలోని గోపాల్ పేటలో మూడు కేసులు, ఆత్మకూర్ లో రెండు, అమరచింతలో ఒకటి, వనపర్తి టౌన్ లో ఒక కేసు నమోదు అయ్యాయి. డీఎస్పీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో చోరీ కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎంతో చాక చక్యంగా పట్టుకున్నారు.
కేసు చేదనలో కీలక పాత్ర పోషించిన ఆత్మకూరు సిఐ. శివ కుమార్, వనపర్తి సిఐ. కృష్ణయ్య, ఎస్ఐ లు హరిప్రసాద్ , నరేందర్,ఇతర పోలీసులను ఎస్పీ. గిరిధర్ రావు ప్రత్యేకంగా అభినంధించి, రివార్డులు అందజేశారు.