Tuesday, November 26, 2024

ట్విట్ట‌ర్ వార్….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఇప్పటికే విభేదాలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇచ్చిన మెడికల్‌ కాలేజీలపై గవర్నర్‌ తాజాగా చేసిన ఒక ట్వీట్‌ ఈ విభేదాలను తారాస్థాయికి తీసుకువెళ్లింది. తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు ఎన్ని మెడికల్‌ కాలేజీలు ఇచ్చిందని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆదివారం ట్విట్టర్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇచ్చిన సమాధానం రాజకీయ వేడిని రాజేసింది. నిద్రపోయి ఆలస్యంగా మేల్కొని అడిగితే ఎలా? అన్న గవర్నర్‌ ట్వీట్లకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కౌంటర్‌ ట్వీట్లు చేశారు. 157 మెడికల్‌ కాలేజీలు ఇచ్చినపుడు ఒక్క కాలేజీ ఇవ్వడానికి కేంద్రానికి తెలంగాణ కనిపించలేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణ ప్రభుత్వంలో ఉండగానే మెడికల్‌ కాలేజీలు కేంద్రాన్ని అడిగారని గుర్తుచేశారు. గవర్నర్‌ అనవసర విమర్శలు మానుకుని తెలంగాణకు వీలైతే మంచి చేయాలని చురకంటించారు. కాగా, గవర్నర్‌ ఆమె ట్వీట్‌లో ”ప్రధానమంత్రి స్వాస్థ్‌ సురక్షా యోజన కింద కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఆ సమయంలో సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తమిళనాడుకు ఒకే ఏడాదిలో 11 మెడికల్‌ కాలేజీలు లభించాయి” అని తెలిపారు. మీరు నిద్రపోయి ఆలస్యంగా మేల్కొని ఆ తర్వాత ఇవ్వమని అడుగుతారంటూ ట్వీట్‌ చేసిన వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గట్టి కౌంటర్‌ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు…
గవర్నర్‌ ట్వీట్‌కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగానే సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ఎందుకు కనిపించలేదని నిలదీశారు. ఈ మేరకు అప్పటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్ని మెడికల్‌ కాలేజీలు కోరారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల వీడియోని కూడా జతపరిచారు. దేశంలోనే ప్రతి లక్ష మందికి 19 మెడికల్‌ సీట్లతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర నిధులతో 12 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ అనవసర విమర్శలు మానుకొని ఒకే రోజు 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలని పేర్కొన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు నిధుల కొరత ఉందని, దేశవ్యాప్తంగా ఎయిమ్స్‌ అభివృద్ధి కోసం రూ.1365 కోట్లు కేటాయిస్తే వీటిలో కేవలం రూ.156 కోట్లే తెలంగాణకు మంజూరు చేయడానికి గల కారణం ఏంటని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement