హైదరాబాద్ – వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అక్కర్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రైతాంగంపై మీకెందుకు అంత అక్కసు అని రాహుల్‌గాంధీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ ఇవ్వడం చేతగాక.. తెలంగాణ రైతులపై మీ అక్కసు వెల్లగక్కుతారా? అని రాహుల్‌గాంధీని సూటిగా ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను బీఆర్‌ఎస్ పార్టీ కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు