కొనుగోళ్లు లేక కల్లాల వద్దే వడ్లు
20 రోజులుగా అవస్థ పడుతున్న రైతులు
హైడ్రా, మూసీ పేరుతో పేదలపై ప్రతాపం
ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు
ఏరుదాటాక అన్నట్టుంది సీఎం రేవంత్ తీరు
ట్విట్టర్‌లో సెటైర్లతో విరుచుకుపడ్డ కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని, హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపం చూపిస్తున్నదని గురువారం ఎక్స్ వేదికగా విరుచుకుప్పడారు. ‘‘తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం.. రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద ₹లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్థం అవుతుంది అని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఏరుదాటిన తర్వాత…
అందితే జుట్టు అందకపొతే కాళ్లు అంటే ఏమో అనుకున్నాం.. ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్థం అవుతుంది. సుఖం వస్తే మొకం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం.. పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్థమవుతుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం.. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్థం అవుతుంది. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్థం అవుతుంది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ మార్పు.. మాకొద్దు!
ఇదో పనికిమాలిన పాలన పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదు
పట్టించుకునేవారు లేక పట్టణాల విలవిల
కాంగ్రెస్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించాల్సిందే
ట్విట్టర్‌లో విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ తొలి పాలకుడి ఆశయాలను రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నీరుగార్చడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదని ట్విట్టర్‌లో విమర్శించారు. ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికే అతీగతీ లేదని దుయ్యబట్టారు.
సమస్యలకు నిలయంగా పల్లెలు..
‘పల్లె ప్రగతి’ వల్ల మొన్నటి దాకా మురిసిన పల్లెలు.. నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతితో పరుగులు తీసిన పట్టణాలు, నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని ఫైరయ్యారు. ఒకప్పుడు పల్లె కన్నీరు పెడుతోంది అని పాడుకున్నాం.. ఇప్పుడు పట్టణాలు విలవిలలాడుతున్నాయని బాధపడే దుస్థితి దాపురించిందని కేటీఆర్ విమర్శించారు. ఈ మార్పు మాకొద్దు అనే నినాదం మొదలైందని, కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించే రోజు దగ్గరపడిందని ఎక్స్ వేదికగా చెప్పారు.