Friday, September 20, 2024

Twit – రైతుల ప్రాణాల‌తో కాంగ్రెస్ చెల‌గాటం … కేటీఆర్​

రేవంత్ స‌ర్కార్ మొద్దు నిద్ర‌
రుణమాఫీ అంతా బోగస్
ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ ఫైర్​

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రైతుల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింద‌ని, అధికార కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌సాయ రంగాన్ని తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని, రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భ‌రోసా అంద‌క ఇంకొంద‌రు రైతన్నలు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని కొందరు… పెట్టుబడి సాయం రైతు భరోసా రాక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. రైతు రుణమాఫీ అంతా బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అని ఆయన విమర్శించారు.

- Advertisement -


నిన్న… రైతు సురేందర్ రెడ్డి… అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాలేదని, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలయ్యాడని పేర్కొన్నారు.

నేడు… రైతు సాగర్ రెడ్డి… భార్యాభర్తలిద్దరిలో ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, దీంతో ఆయన ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వెల్లడించారు. తన పేరిట ఉన్న రూ.లక్షన్నర, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రూపాయల రుణంలో ఒక్కరికీ మాఫీ కాలేదని తెలిపారు. రుణమాఫీతో కష్టాలు గట్టెక్కుతాయని ఆయన ఆశలు పెట్టుకున్నారని, కానీ దారుణంగా మోసపోయినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి?, ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి? డిసెంబర్‌లో పెట్టిన డెడ్‌లైన్ సెప్టెంబర్ దాటినా అమలు కాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రూ.49,500 వేల కోట్ల రుణమాఫీలో పావు శాతం కూడా చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఇందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి?
రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని సూచించారు. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement