హైదరాబాద్ – అద్దుమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించిన నువ్వు మహిళలను కోటీశ్వరులను చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రాతో బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్నావని ఫైరయ్యారు. మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్నారని విమర్శించారు.
ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ పోస్ట్ చేసారు. పేదింటి బిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టాడని, నిండు గర్భిణీల న్యూట్రీషన్ కిట్టును మాయంచేశావని నిప్పులు చెరిగారు. పేదింటి ఆడబిడ్డలకోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మవడిలను ఎత్తేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా అంటూ ప్రశ్నించారు
తులం బంగారం పేరుతో ఆడబిడ్డల వంచించారని చెప్పారు. నెలకు రూ.2500 పేరుతో చెవిలో పువ్వులు పెట్టారన్నారు. స్కూటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, పింఛన్లకు పంగనామాలు పెట్టారని విమర్శించారు. బతుకమ్మ చీరలను బందువెట్టిన నువ్వు ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీ డమ్మీ పథకాలు గడపలు దాటవు కానీ, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయన్నారు. కోటి రతనాల వీణ తెలంగాణ భవిష్యత్ ఏడాది పాలనతో ప్రశ్నార్థకం చేశావని మండిపడ్డారు. పదేండ్ల కేసీఆర్ పాలనతో భరోసా నిండిన బతుకుల్లో భయం నింపావని, సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావన్నారు. బతుకమ్మ నెత్తిన చేతులే నీ భరతం పడతాయంటూ ఎక్స్ విమర్శించారు.